West Bengal: సీఏఏకు వ్యతిరేకంగా బొమ్మలు వేస్తూ.. బెంగాల్ సీఎం మమత నిరసన
- చిత్రాలను సీఏఏ, ఎన్నార్సీ నిరసనల్లో ప్రదర్శిస్తామన్న దీదీ
- దేశ వ్యాప్తంగా గ్యాలరీల్లో చిత్రాలను ఉంచుతాం
- శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని పిలుపు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిరసిస్తూ.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బొమ్మలు వేస్తూ.. నిరసన తెలిపారు. ఈ రోజు కోల్ కతాలోని మేయో రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద సీఏఏను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సీఏఏను వ్యతిరేకిస్తూ కళాకారులు చిత్రాలు గీశారు. మమత కూడా వారితో కలిసి కుంచె పట్టి చిత్రాలు వేశారు.
సీఏఏ, ఎన్నార్సీలపై శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలలో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాక, దేశవ్యాప్తంగా ఉన్న పలు గ్యాలరీల్లో కూడా వీటిని ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ మమత బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే.