Botsa Satyanarayana: 'రాజధాని విశాఖ' ప్రతికూలతల గురించి మీడియా కథనాలపై బొత్స సత్యనారాయణ వివరణ!
- విశాఖలో రాజధాని వద్దని చెప్పిన జీఎన్‌రావు కమిటీ
- దాచిపెట్టిన రాష్ట్ర సర్కారు
- నివేదికలోని విషయాలను బట్టబయలు చేసిన దినపత్రికలు
- తుపాను రాని నగరం ఉంటుందా? అని బొత్స ప్రశ్న
కమిటీల సిఫారసు మేరకే తాము మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు విషయాలను దాచి పెట్టిందంటూ ఈ రోజు తెలుగు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తే సహజ సిద్ధంగా కొన్ని ప్రతికూలతలు కూడా వున్నాయని జీఎన్‌రావు కమిటీ తెలిపిందని, ఈ విషయాన్ని దాచి పెట్టి, ప్రభుత్వం రాజధాని ప్రకటన చేసిందని నేటి పత్రికల్లో కథనాలు వచ్చాయి.
విశాఖలో రాజధాని ఏర్పాటుకు ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయని, తుపాన్లు, సముద్ర మట్టంతో ముంపు ముప్పు ఉందని, పర్యావరణపరమైన సమస్యలు, సముద్రంలో అనేకచోట్ల చమురు తెట్టు వంటి ప్రతికూలతలు ఉన్నాయని కమిటీ చెప్పందని, ఇందుకు సంబంధించిన నివేదికను కూడా పలు పత్రికలు బట్టబయలు చేశాయి.
దీనిపై తాడేపల్లిలో బొత్స మీడియాతో మాట్లాడుతూ... 'కమిటీల ప్రతులను చెత్తకుప్పలో వేసేయాలని, చించేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు అదే కమిటీ పేరిట మరోలా రాజకీయాలు చేస్తున్నారు. ఆ కమిటీ నివేదికలు చెత్త అని చెప్పిన టీవీలు, వార్తా పత్రికలే ఇప్పుడు మరోలా ప్రచారం చేస్తున్నాయి' అంటూ మండిపడ్డారు.
అసలు తుపాను ముప్పు లేకుండా ఏ నగరం అయినా ఉంటుందా? అని ప్రశ్నించారు. విశాఖలో 1,75,000 ఇళ్లు కట్టిచ్చి ఇస్తామని తెలిపారు. వక్రభాష్యం పలుకుతూ నివేదికలపై ఆరోపణలు చేయొద్దని అన్నారు. పలు పత్రికలపై ఆయన మండిపడ్డారు. 'తాను ఏం చెబుతారో అదే జరగాలని 'ఈనాడు' రామోజీరావు కోరుకుంటారు' అని ఆరోపించారు.
'సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఈ రిపోర్టుకి విలువ లేదు.. చెత్త అని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు పరిశీలించి మాట్లాడాలి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడాలి. శాసనమండలి రద్దు గురించి 1980ల్లో చంద్రబాబు ఏం మాట్లాడారో, రాజశేఖర్ రెడ్డి మళ్లీ పునరుద్ధరించినప్పుడు ఏం మాట్లాడారో చూశాం. మళ్లీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. తన రాజకీయాల కోసం ఎలాగైనా మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని బొత్స అన్నారు.
'తనకు ప్రయోజనాలు కలిగే విషయంలో ఇదో అద్భుత ఆలోచన అంటారు. తనకు రాజకీయ ప్రయోజనాలు లేనప్పుడు ఇదో దుర్మార్గమైన ఆలోచన అంటారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి. ఏ అంశంపైనా కూడా చంద్రబాబుకి అవగాహన లేదు. సునామీ, తుపానులు వస్తే నష్టం అని, విశాఖలో రాజధాని వద్దని అంటున్నారు' అని బొత్స చెప్పారు.
'అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బోస్టన్, జీఎన్ రావు కమిటీలను అందరూ క్షుణ్ణంగా పరిశీలించాలి. మేము ఒక్క రాజధాని పెట్టడం లేదు కదా? మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడిలా మేము వ్యాపారుల సలహాలు తీసుకోము. కమిటీల ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని బొత్స వ్యాఖ్యానించారు.
రాజధాని నిర్ణయానికి, శాసన మండలి రద్దుకు సంబంధం లేదని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయాలు కాస్త ఆలస్యం అవుతాయేమోకానీ నిర్ణయాలు మాత్రం మారబోవని తెలిపారు. ఏపీ అభివృద్ధి చెందకూడదని కొందరు భావిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరారు.