Bonda Uma: ఎవరినీ సంప్రదించకుండానే జీఎన్ రావు, బీసీజీ కమిటీలు వేశారు: బోండా ఉమ
- అందరినీ సంప్రదించే సిఫారసులు చేశామనడం హాస్యాస్పదం
- ఆరు రోజుల్లోనే జీఎన్.రావు కమిటీ రాష్ట్రాన్ని చుట్టేసిందా?
- తాడేపల్లిలో సిద్ధమైన నివేదికపై కమిటీ సభ్యులు సంతకాలు చేశారు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ప్రాధాన్యతల వారీగా రాజధాని ఏర్పాటుపై సిఫారసులు చేసిందని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని చూసుకోవాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందన్నారు. అమరావతిపై ఆనాడు అసెంబ్లీలో తల ఊపిన జగన్ తాజాగా దాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కొత్తగా ఎవరినీ సంప్రదించకుండానే జగన్ సర్కారు జీఎన్ రావు, బీసీజీ కమిటీలు వేసిందన్నారు.
అందరినీ సంప్రదించే సిఫారసులు చేశామని జీఎన్ రావు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆరు రోజుల్లోనే కమిటీ నివేదిక ఇచ్చిందనీ, ఆరు రోజుల్లో 13 జిల్లాలను చుట్టేశారా? అంటూ ఉమ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో సిద్ధమైన నివేదికపై జీఎన్ రావు కమిటీ సంతకాలు చేసిందని ఆరోపించారు. నివేదికలో కమిటీ విశాఖను ఎందుకూ పనికి రాని నగరంగా పేర్కొంటూ.. అక్కడే పాలన రాజధాని పెట్టవచ్చంటోందని ఆయన ఎత్తి చూపారు.
మరోపక్క విశాఖలో తుపానులు వస్తాయని.. అక్కడ పాలన రాజధాని కుదరదంటూ మీడియా ప్రతినిధులంటే.. తుపానులు అంతటా వస్తాయంటూ జీఎన్ రావు అసంబద్ధంగా మాట్లాడారని ఉమ విమర్శించారు. అమరావతిని చంపేసి విశాఖకు పాలన రాజధానిని తరలించడంలో మర్మం ఏమిటి? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం కమిటీలను ఏర్పాటు చేశారని విమర్శించారు. కమిటీల నివేదికలను మీడియాలో ప్రచురిస్తే.. జీఎన్ రావు మీడియా ముందుకు వచ్చారన్నారు.