Nara Lokesh: రేపో, మాపో విద్యుత్ చార్జీలు పెంచుతారు: నారా లోకేశ్
- పెట్రో ధరలు పెరిగాయంటూ మీడియాలో కథనం
- ప్రజలపై పెట్రో బాంబు వేయడం దారుణం
- పేదల రక్తాన్ని సైలెంట్ గా తాగేస్తున్నారంటూ విమర్శలు
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలపై రూ.2 వరకు పెరిగేలా వ్యాట్ ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల ముందు పెంచుకుంటూ పోతానని వైఎస్ జగన్ అంటే సంక్షేమ కార్యక్రమాలేమో అనుకున్నానని, కానీ ఆయన అన్నది ప్రజలపై భారం అని ఇప్పుడర్థమవుతోందని విమర్శించారు.
ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు పెంచేశారని, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచేశారని వివరించారు. ఈ క్రమంలో రేపో, మాపో విద్యుత్ చార్జీలు పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పెట్రో బాంబు వేయడం దారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. జగన్ పేదల రక్తాన్ని సైలెంట్ గా తాగేస్తున్నారని విమర్శించారు.