Priyanka Gandhi: బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇదంతా: ప్రియాంక గాంధీ
- సీఏఏ వ్యతిరేకులను కాల్చి పారేయాలన్న అనురాగ్ ఠాకూర్
- జామియా విద్యార్థుల నిరసనపై కాల్పులు
- ఆయన కోరుకుంటున్నది ఇదేనా? అంటూ ప్రియాంక విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలపై కాల్పులు జరగడాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆయన కోరుకుంటున్నది ఇదేనా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న జామియా విద్యార్థులపై కాల్పులు జరుగుతుంటే ఢిల్లీ పోలీసులు చూస్తూ ఉండిపోయారని, అనురాగ్ ఠాకూర్ కోరుకుంటున్నది ఇదేనా? అని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీ గాడ్సే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.
ఎలాంటి ఢిల్లీని తయారుచేయాలనుకుంటున్నారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు. వారు హింస లేదంటే అహింస వైపు నిలబడతారా? లేక, అభివృద్ధి, ఆందోళన వైపు నిలబడతారా? అని నిలదీశారు. సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని కాల్చిపారేయాలంటూ అనురాగ్ ఠాకూర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వెంటనే జామియా విద్యార్థులపై కాల్పులు జరగడం దుమారం రేపుతోంది.