CAA: సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం.. డాక్టర్ కఫీల్‌ఖాన్ అరెస్ట్
- అలీగఢ్ యూనివర్సిటీలో వివాదాస్పద ప్రసంగం
- సెక్షన్ 153 కింద కేసు నమోదు
- ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్‌ఖాన్ అరెస్టయ్యారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వెలుపల 600 మంది విద్యార్థులను ఉద్దేశిస్తూ గత నెలలో ఆయన చేసిన ప్రసంగం విమర్శలకు దారితీసింది.
అంతేకాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీంతో ఆయనపై సెక్షన్ 153 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా, ఆయనను ముంబైలో అరెస్ట్ చేశారు. నిజానికి 2017లో గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో పిల్లల మృతి కేసులోనే కఫీల్‌ఖాన్‌ను అరెస్ట్ చేయాల్సి ఉండగా, అప్పట్లో ఆయన తప్పించుకోగలిగారు. తాజాగా, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా ప్రసంగించిన ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోయారు.