IBM: ఐబీఎం సీఈఓగా భారత సంతతి వ్యక్తి అరవింద్ ఎంపిక!

  • నవశకానికి ఆయన సరికొత్త నాయకుడన్న సీఈఓ గిన్నీ రోమెట్టీ 
  • ఈ ఏడాది చివరిలో ఆమె పదవీ విరమణ 
  • కాన్పూరు ఐఐటీలో విద్యాభ్యాసం చేసిన అరవింద్

ప్రపంచంలోని ప్రముఖ సంస్థల ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారత సంతతి వ్యక్తులు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ), సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ సీఈఓ), అజయ్ బంగా (మాస్టర్ కార్డు సీఈఓ), శంతను నారాయణన్ (అడోబ్ సీఈఓ)ల సరసన మరొకరు చేరారు. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారతీయుడు అరవింద్ కృష్ణ(57)ను డైరెక్టర్ల బృందం ఎంపిక చేసింది. 

ఆయన ప్రస్తుతం కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హెూదాలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్న గిన్నీ రోమెట్టీ ఈ ఏడాది చివరిలో పదవీ విరమణ చేయనున్నారు. అయితే అరవింద్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పదవీ విరమణ చేసే వరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగుతారు. 

ఈ సందర్భంగా రోమెట్టి మాట్లాడుతూ ఐబీఎం నవశకానికి అరవింద్ సరైన నాయకుడని ప్రశంసించారు. ఐబీఎం కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తయారీలో అరవింద్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.

కాన్పూరు ఐఐటీ నుంచి పట్టా పొందిన అరవింద్ అనంతరం ఇల్లినాయిస్ యూనివర్సిటీలో పీ హెచ్ డీ పూర్తి చేశారు. 1990లో ఐబీఎంలో చేరారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ తనను సీఈఓగా ఎంపిక చేసిన డైరెక్టర్లకు, గిన్నీ రోమెట్టీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో క్లయింట్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

  • Loading...

More Telugu News