China: ఈ విషమ పరీక్షను ఎదుర్కొనేందుకు చైనీయులకు శక్తి చేకూరాలని కోరుకుంటున్నా: రాహుల్ గాంధీ
- చైనాలో కరోనా వందలాది మందిని చంపేసింది
- వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం లక్షలాది మందిని నిర్బంధించారు
- వారికి సంఘీభావం తెలుపుతున్నాను
చైనాలో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 213కి చేరింది. దీంతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా మందిని బయటకు రానివ్వకుండా చైనాలో ఆంక్షలు విధించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
'చైనాలో కరోనా వైరస్ వందలాది మందిని చంపేసింది. ఇది వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం వైరస్ బాధితులతో పాటు లక్షలాది మందిని ఎక్కడికీ వెళ్లకుండా నిర్బంధించారు. వారికి సంఘీభావం తెలుపుతున్నాను. ఈ భయంకరమైన విషమ పరీక్షను ఎదుర్కొనేందుకు చైనీయులకు ధైర్యం, శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. చైనాలోని వుహాన్లో ప్రబలిన ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాపించింది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, భారత్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని దేశాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.