TRS: భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్-బీ పాస్ తీసుకొస్తాం: మంత్రి కేటీఆర్
- ఐపాస్ లాగా బీపాస్ కూడా ఆదర్శంగా నిలుస్తుంది
- హైదరాబాద్ పైనే కాదు ఇతర నగరాలపైనా నిర్మాణ రంగ సంస్థలు దృష్టి పెట్టాలి
- విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్-బీ పాస్ తీసుకొస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, టీఎస్ ఐపాస్ లాగానే టీఎస్ బీపాస్ కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, కేవలం హైదరాబాద్ పైనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలపైనా నిర్మాణ రంగ సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు.
బిల్డర్లు నూతన టెక్నాలజీ ఉపయోగించాలి
పశ్చిమ హైదరాబాద్ లో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు, కాలుష్యం లేకుండా నిర్మాణంలో నూతన టెక్నాలజీ ఉపయోగించాలని సూచించారు. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్మూధూళి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బిల్డర్లు స్వీయ నియంత్రణ పాటించాలని హైదరాబాద్ నిర్మాణ రంగంలో లక్షలాది మందికి ఉఫాధి అవకాశాలు లభించనున్నాయని, ఈ రంగంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలే కూలీలు సగానికిపైగా ఇక్కడ ఉన్నారని అన్నారు. రాష్ట్రంలోని స్థిరాస్థి రంగానికి ఎలాంటి ఢోకాలేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ మనకు లభించడం రాష్ట్రం అదృష్టం
తెలంగాణలో స్థిరమైన రాజకీయ వ్యవస్థ వుందని, కార్యదక్షత, సమర్థత, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ మనకు లభించడం రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు. నిర్వరామంగా పని చేసే వ్యక్తి కేసీఆర్ అని, ఆయన కృషి వల్లే హైదరాబాద్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని, దేశ వ్యాప్తంగా పలు చోట్ల అస్థిరత ఉన్నా తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉందని అన్నారు. 2014లో జేఎల్ఎల్ రేటింగ్స్ లో హైదరాబాద్ టాప్ 20 జాబితాలో లేదని, 2020లో 130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.