Tirumala: తిరుమల భక్తుల్లో 'కరోనా' భయం!
- ముందు జాగ్రత్త చర్యగా నోస్ మాస్క్ లు
- ఇండియాలో కరోనా వెలుగుచూడటంతో మరింత అప్రమత్తత
- తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల వెంకన్న భక్తులను ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుంది. నిత్యమూ లక్షలాది మంది వచ్చి వెళుతుండే తిరుమలకు వైరస్ సోకిన ఏ ఒక్కరు వచ్చినా, అది కొన్ని వందల మందికి వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. దీంతో భక్తులు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు ముఖానికి మాస్క్ లు ధరిస్తున్నారు. తాజాగా, ఇండియాలోనూ కరోనా వైరస్ వెలుగుచూసిన నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా నోస్ మాస్క్ లను ధరిస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు.
కాగా, ఈ ఉదయం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. దివ్య దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుందన్నారు. నిన్న స్వామివారిని సుమారు 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు రథసప్తమి కావడంతో స్వామివారు 7 వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.