Visakhapatnam: పరీక్ష ఫీజు పెంపుపై ఏయూ విద్యార్థుల నిరసన గళం... వర్షంలోనూ ఆగని ఆందోళన!

  • రిజిస్ట్రార్ కార్యాలయం కూడలిలో బైఠాయింపు 
  • మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం వరకు ఆందోళన 
  • అన్ని ఫీజులు పెంచామన్న అకడమిక్ డీన్

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు నిన్న నిరసన గళం ఎత్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఆందోళన రాత్రి వరకు కొనసాగింది. వర్సిటీలోను, దాని అనుబంధ కళాశాలల్లో వివిధ పరీక్షలకు సంబంధించిన ఫీజును రూ.855 నుంచి రూ.1200లకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థాయిలో పెంపుదలను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 2 గంటలకు రిజిస్ట్రార్ కార్యాలయం జంక్షన్ లో విద్యార్థులు భారీగా చేరుకున్నారు. రౌండ్ గా బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.

అయితే సాయంత్రం ఐదు గంటలైనా అధికారులు ఎవరూ విద్యార్థుల ఆందోళనను పట్టించుకోలేదు. కనీసం విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో విద్యార్థులు నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుటకే వచ్చి బైఠాయించారు. పెంచిన ఫీజులు తగ్గించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆ దశలో వర్షం ప్రారంభమైనా విద్యార్థులు ఒక్క అడుగు కూడా వెనుకడుగు వేయకుండా తమ ఆందోళన కొనసాగించారు.

ఒక దశలో పరిస్థితి వేడెక్కినా వర్సిటీ అధికారులు మాత్రం కనీసం విద్యార్థులవైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఫీజుల పెంపు విషయమై వర్సిటీ అకడమిక్ డీన్ వెంకటరావు మాట్లాడుతూ గత ఏడాది జూన్ లోనే ఫీజులను పెంచామని, ఇప్పటికిప్పుడు పెంచింది కాదన్నారు.

ఏయూలో ఆటోమేషన్, ఓఎంఆర్ అమలు తదితర అవసరాల కోసం ఈ పెంపు అనివార్యమైందని, ఏయూతోపాటు అనుబంధ కళాశాలలన్నింటికీ ఈ పెంపు వర్తిస్తుందని చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా విద్యార్థులు ఆందోళనకు దిగడం విచారకరమన్నారు.

  • Loading...

More Telugu News