Nirmala Sitharaman: జీఎస్‌టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు: నిర్మలాసీతారామన్
- ఒకే పన్ను విధానంతో సత్ఫలితాలు
- ఇప్పటి వరకు 40 కోట్ల రిటర్న్‌లు దాఖలు
- కొత్తగా 16 లక్షల మంది ఆదాయపన్ను చెల్లింపుదారులు
దేశవ్యాప్తంగా ఒకేరకమైన పన్ను విధానం కోసం అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీ వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరిగిందని, ముఖ్యంగా శ్లాబుల తగ్గింపు తర్వాత వారి నెలవారీ ఖర్చుల్లో నాలుగు శాతం మేరకు ఆదా చేసుకోగలిగారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. అదే సమయంలో అన్ని వర్గాల చెల్లింపుదారులు లక్ష కోట్లు ఆదా చేసుకోగలిగారని వివరించారు. ఈరోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా జీఎస్‌టీపై మాట్లాడారు.
ట్రాన్స్‌పోర్టు, లాజిస్టిక్ రంగాల్లో జీఎస్‌టీ పనితీరు చాలాబాగుందన్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు నలభై కోట్ల జీఎస్టీ రిటర్న్‌లు దాఖలైనట్లు చెప్పారు. కొత్తగా 16 లక్ష మంది ఆదాయపన్ను పరిధిలోకి వచ్చారన్నారు. జీఎస్‌టీలో సమస్య పరిష్కారానికి జీఎస్‌టీ మండలి వేగంగా పనిచేస్తోందని తెలిపారు.