Union Budget 2020: ఆదాయ పన్ను మినహాయింపులు... కొత్త శ్లాబులు.. కేంద్ర బడ్జెట్ లో వెల్లడి
- ఆదాయ పన్ను శ్లాబులో భారీ మార్పులు
- 4 శ్లాబుల స్థానంలో 7 శ్లాబులు
- మధ్య, ఎగువతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని పన్ను విధానం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఆదాయ పన్ను పరిమితులను వివరించారు. ఆదాయపన్ను శ్లాబులో భారీగా మార్పులు చేశారు. ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను అంశంలో ఇప్పటివరకు 4 శ్లాబులు ఉండగా, ఇప్పుడు వాటిని 7 శ్లాబులుగా విస్తరించారు.
రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను విధించారు. రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను లేదు.