Union Budget 2020: నిరాశా నిస్పృహలతో ఉన్న రైతాంగానికి కొండంత అండనిచ్చే బడ్జెట్ ఇది!: పవన్ కల్యాణ్ ప్రశంసలు
- కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్టు తెలిపిన జనసేనాని
- గొప్ప ఆకాంక్షలతో కూడుకున్న బడ్జెట్ అంటూ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్ర బడ్జెట్ పై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొన్నప్పటికీ, దాని ప్రభావం భారత్ పై ఉన్నా కూడా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప ఆకాంక్షలతో కూడుకున్న బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు.
ఈ బడ్జెట్ బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేలా ఉందని, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలకు అండగా ఉండే బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. నిరాశా నిస్పృహలతో ఉన్న రైతాంగానికి ఇది కొండంత అండనిస్తుందనడంలో సందేహంలేదని, ఈ బడ్జెట్ ను జనసేన స్వాగతిస్తోందని పవన్ స్పష్టం చేశారు. ఉపాధి కోసం యువతకు బోలెడన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఆదాయపు పన్నుకు సంబంధించి 7 శ్లాబుల విధానం ఆదాయ వర్గాలకు ఊరట కలిగిస్తుందని చెప్పారు.