Amaravati: ఢిల్లీ వెళ్లిన అమరావతి రైతులు.. ప్రధానిని కలిసి గోడు చెప్పనున్న జేఏసీ నేతలు
- 45 రోజులు దాటిన అమరావతి రైతుల పోరు
- రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలవనున్న రైతులు
- ఒకే రాజధాని-ఒకే రాష్ట్రం తమ నినాదమని స్పష్టీకరణ
రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసన 45 రోజులు దాటింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కేంద్రంతో తమ గోడు చెప్పుకునేందుకు రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ వారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి తమ గోడు చెప్పుకోనున్నారు.
ఢిల్లీ చేరుకున్న రైతులు, జేఏసీ నేతలు అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ పోరాటానికి న్యాయం చేయాలని ప్రధానిని కోరుతామన్నారు. పోరాటంలో భాగంగా ఇప్పటి వరకు 30 మంది రైతులు చనిపోయారని, అయినప్పటికీ ఇటు రాష్ట్రప్రభుత్వం కానీ, అటు కేంద్రం కానీ బాధిత కుటుంబాలకు సంతాపం తెలపలేదన్నారు. ‘ఒకే రాజధాని- ఒకే రాష్ట్రం’ తమ నినాదమని తేల్చి చెప్పారు.