Corona Virus: కరోనా మరణాలతో హడలిపోతున్న చైనా... నిన్న ఒక్కరోజే 57 మంది మృత్యువాత!
- 361కి చేరిన చనిపోయిన వారి సంఖ్య
- కొత్తగా 2,829 కేసులు నమోదు
- దిక్కుతోచని స్థితిలో డ్రాగన్
కరోనా మరణాలతో చైనా వణికిపోతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగని మరణాలు ఆ దేశవాసుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 57 మంది చనిపోవడం షాకిచ్చింది. ఇది చాలదన్నట్లు ఒకేరోజు కొత్తగా 2,829 మంది వ్యాధి బారిన పడ్డారని తేలడం, వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉందని నిర్థారణ కావడంతో ఈ మరణ మృదంగం ఎక్కడికి చేరుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 17,205కి చేరింది. మరో 1,89,583 మంది అనుమానితులు ఉన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చైనా నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తోంది. మరోవైపు కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలు చైనా ప్రయాణాన్ని మానుకోవాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.