Harsha kumar: జగన్ పత్రిక పైనే ‘ఎల్లో కలర్‘ నిండుగా ఉంది!: మాజీ ఎంపీ హర్షకుమార్
- ఓ సీఎంలా కాక ఫ్యాక్షనిస్టులా జగన్ ఆలోచిస్తున్నాడు
- రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నారు
- టీడీపీ హయాంలో నన్నెప్పుడూ వేధించలేదు
‘ఎల్లో మీడియా’ అంటూ ప్రచారం చేస్తున్న సీఎం జగన్ పత్రికపైనే ఎల్లో కలర్ నిండుగా ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఓ సీఎంలా కాకుండా ఫ్యాక్షనిస్టులా జగన్ ఆలోచిస్తున్నాడని, రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 42 సార్లు తనపై ఆంక్షలు విధించారు కానీ, తనను ఎప్పుడూ వ్యక్తిగతంగా వేధించలేదని, అలాంటిది జగన్ హయాంలో తనను వేధిస్తున్నారని ఆరోపించారు.
‘మూడు రాజధానులు’ తుగ్లక్ నిర్ణయం
రాజధాని విషయంలో జగన్ తప్పు చేస్తున్నారని, ‘మూడు రాజధానులు’ అనేది పిచ్చి ఆలోచన అని, తుగ్లక్ నిర్ణయం అని హర్షకుమార్ విమర్శించారు. రాజధానికి సంబంధించిన కమిటీలన్నీ జగన్ ఏర్పాటు చేసుకున్నవేనని, బోస్టన్ కమిటీ అంటే ఎవరికి తెలుసని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించిన హర్షకుమార్, విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని అన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందని భావించే అమరావతిని చంపేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో అక్రమ కట్టడాల తొలగింపులో న్యాయమూర్తులను దూషించిన ఘటన కేసులో అరెస్టయిన హర్షకుమార్ ఇటీవలే విడుదలయ్యారు.