Tirumala: తిరుమలలో కనిపించని రద్దీ!
- భక్తులపై చలి ప్రభావం
- 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు
- సోమవారం స్వామిని దర్శించుకున్న 59 వేల మంది
తిరుమల గిరులపై చలి తీవ్రత భక్తులపై ప్రభావాన్ని చూపుతోంది. చలి అధికంగా ఉండటంతో భక్తుల సంఖ్య సగానికి తగ్గింది. ఈ ఉదయం రద్దీ సాధారణంగా ఉండగా, స్వామి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. వారికి దర్శనానికి మూడు నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారికి, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు 2 గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని అన్నారు. నిన్న శ్రీవారిని 59,015 మంది భక్తులు దర్శించుకున్నారని, 19,389 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు వచ్చిందని వెల్లడించారు.