Medaram: కదిలిన పగిడిద్దరాజు... 'మేడారం జాతర'కు పోటెత్తిన భక్తజనం!
- ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర
- సమ్మక్క - సారక్క జాతరకు సర్వం సిద్ధం
- రేపు సాయంత్రం జాతర మొదలు
తెలంగాణ కుంభమేళాగా పేరుతెచ్చుకున్న 'మేడారం జాతర'కు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పిలుచుకునే సమ్మక్క-సారక్క జాతరలో పాల్గొనేందుకు ఇప్పటికే 5 లక్షల మందికి పైగా భక్తులు మేడారం ప్రాంతానికి చేరుకున్నారు. ఆరెం వంశీయులు, యాపలగడ్డ గ్రామం నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకుని కాలి నడకన మేడారంకు బయలుదేరారు. డోలీల చప్పుళ్లతో, సంప్రదాయ నృత్యాలతో సాగుతూ, రేపు సాయంత్రానికి మేడారం చేరుకోనున్న ఆరెం వంశీయులు, పగిడిద్దరాజు ఆభరణాలకు పూజలు చేసి, ఆపై తీసుకెళ్లి గద్దెలపై నిలుపుతారు.
ఆపై 6వ తేదీ ఉదయం అసలు కార్యక్రమం మొదలవుతుంది. తొలుత సారక్కను గద్దెపైకి చేరుస్తారు. ఆపై మేడారం సమీపంలోని చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెపైకి తీసుకుని వస్తారు. ఆ సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్ల కాల్పులను జరుపుతారు. అదే రోజు పగిడిద్దరాజు - సమ్మక్కల వివాహ మహోత్సవం సంప్రదాయ ప్రకారం జరుగుతుంది.
రెండు రోజుల వేడుక అనంతరం, నాగవెల్లి జాతర నిర్వహించి, వన దేవతలను తిరిగి వనంలోకి పంపించడంతో అధికారికంగా జాతర ముగుస్తుంది. ఆపై పగిడిద్ద రాజును పూర్వపు స్థానానికి చేర్చే కార్యక్రమం జరుగుతుంది. కాగా, తెలంగాణలో ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకునే నిమిత్తం మొత్తం 33 మంది సభ్యులున్న యునెస్కో బృందం మేడారం జాతరలో పాలుపంచుకునేందుకు వచ్చింది.