Corona Virus: హృదయాలను కదిలిస్తున్న వీడియో.. ఐసీయూలో గుడ్ బై చెప్పుకున్న కరోనా వ్యాధిగ్రస్తులైన వృద్ధ దంపతులు
- ఐసీయూలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులు
- వీరిద్దరూ ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు
- చరమాంకంలో కూడా అంతులేని ప్రేమానురాగాలు
కరోనా వైరస్ దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి చైనాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందనే వార్త కలవరపెడుతోంది. తొలుత రోజుకు 10 నుంచి 20కి పరిమితమైన మరణాలు ఇప్పుడు ఏకంగా రోజుకు 50ని దాటిపోతున్నాయి. ఈ వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి వరకు 425 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏ క్షణంలోనైనా వీరిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో, ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో... అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో కరోనా వైరస్ బాధితులైన వృద్ధ దంపతులు చివరి సారిగా గుడ్ బై చెప్పుకుంటున్న వీడియో అది. వీరిద్దరూ 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నావారే. 'అన్యోన్యమైన జంట అంటే ఏమిటి? వీరిద్దరూ కలవడం, గుడ్ బై చెప్పుకోవడం ఇదే చివరిసారి కావచ్చు' అనే కాప్షన్ అందరినీ కలచివేస్తోంది.
ఈ వీడియోపై నెటిజెన్లు ఆవేదనాభరితంగా స్పందిస్తున్నారు. 'ఇద్దరు వృద్ధులను ఇలా చూడటం చాలా బాధగా ఉంది. దేశంలో పరిస్థితులు చేజారిపోయాయి' అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. 'బాధాకరమైన వీడియో. కానీ ప్రేమకు ఉన్న బలాన్ని, జీవిత చరమాంకం వరకు అది ఉంటుందనే నిజాన్ని ఈ వీడియో మరోసారి వెల్లడిస్తోంది' అని మరో నెటిజెన్ స్పందించాడు.