Bonda Uma: తొమ్మిది నెలల జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది: బోండా ఉమ ఫైర్
- అమరావతి నాశనానికి జగన్ కంకణం కట్టుకున్నారు
- రైతుల ఉద్యమానికి అందరి మద్దతు లభిస్తోంది
- ఈ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు
రాజధాని ప్రాంత రైతులకు టీడీపీ నేత బోండా ఉమ మద్దతుగా నిలిచారు. మందడంలో రైతుల దీక్షా శిబిరానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ, సీఎం జగన్ మూర్ఖత్వపు ఆలోచనలతో అమరావతిని నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ ధోరణితో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.
అమరావతి రైతుల పోరాటంపై ఢిల్లీలో కూడా చర్చించుకుంటున్నారని, జాతీయస్థాయిలో దీనిపై పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయని అన్నారు. న్యాయసమ్మతంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి అందరి నుంచి మద్దతు లభిస్తున్నా ఈ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని, పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు.
శాసనమండలి రద్దు తీర్మానం చేయడంపై జగన్, వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మొదటి నుంచీ కూడా ఒక పథకం ప్రకారం ముందుకు కెళ్లారని, ఒక వర్గం పైనో, పార్టీపైనో, ఒక వ్యక్తిపైనో కక్షతోనే జగన్ వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. తొమ్మిది నెలల జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. 'అమరావతిని పూర్తి చేయలేనటువంటి అసమర్థ జగన్ మూడు రాజధానులు కడతారట' అంటూ సెటైర్లు విసిరారు.