landpooling: మా భూములు ఇచ్చేది లేదు: అధికారులకు విశాఖ రైతుల స్పష్టీకరణ
- ల్యాండ్ పూలింగ్ కు అన్నదాతల నో
- అమరావతిలో వ్యతిరేకించి ఇక్కడ ఎలా చేస్తారంటూ ఎదురు ప్రశ్నలు
- సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా భావిస్తున్న ఏపీ ప్రభుత్వం భూ సేకరణకు తెరతీసిన విషయం తెలిసిందే. అనకాపల్లి, సబ్బవరం, పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని డి పట్టా భూములను గుర్తించిన అధికారులు వాటిని సేకరించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో నిన్న అనకాపల్లి మండలం పాపయ్యసంతపాలెంలో నిర్వహించిన గ్రామ సభలో అధికారులకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ గ్రామ పరిధిలో 138 మంది రైతులకు చెందిన 241.96 ఎకరాలు గుర్తించారు. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇవ్వాలని కోరగా ముగ్గురే ముందుకు వచ్చారు. మిగిలిన వారు వ్యతిరేకించారు.
అమరావతిలో రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని, ఇప్పుడు అధికారంలోకి రాగానే సేకరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రైతులను ఒప్పించేందుకు అధికారులు ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో మధ్యలోనే వెనుదిరిగారు.
పద్మనాభం మండలం తునివలసలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ 34 మంది రైతులకు చెందిన 35 ఎకరాలను అధికారులు గుర్తించి అంగీకార పత్రాలు అడిగారు. రైతులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పి వెళ్లిపోయారు. సబ్బవరం మండలం గాలిభీమవరంలో రైతులు ఏకంగా సభాప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు.
తన తాత స్వాతంత్ర్య సమరయోధుడని, ఆయన పేరున ఇచ్చిన భూమి కూడా లాక్కుంటున్నారని, స్వాతంత్ర్య సమరయోధుడికి ఇచ్చిన గౌరవం ఇదేనా? అని గ్రామానికి చెందిన చిట్టిబోయిన అప్పారావు వాపోయాడు. ఆనందపురం మండలం తంగుడుబిల్లి రైతులు తమకు భూములే జీవనాధారమని, అటువంటి వాటిని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.