Nirbhaya: నిర్భయ దోషుల ఉరి అమలు కేసు: రేపు విచారించనున్న సుప్రీం
- దోషులను వేర్వేరుగా ఉరి తీయాలంటూ కేంద్రం పిటిషన్
- ఉరి అమలుపై స్టే ఉంటే వాళ్లకు శిక్ష విధించడం కుదరదని వ్యాఖ్య
- దోషుల్లో కనీసం ఇద్దరిని ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలని వినతి
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు విషయంలో జరుగుతోన్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దోషులను వేర్వేరుగా ఉరి తీయాలంటూ తన పిటిషన్లో కేంద్రం కోరింది. ఈ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై రేపు విచారణ జరుపుతామని పేర్కొంది.
ఉరి అమలుపై స్టే ఉంటే వాళ్లకు శిక్ష అమలు చేయడం కుదరదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది స్టేను ఎత్తివేయాలని కోరారు. ఇదే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం పరిశీలించింది. నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో కనీసం ఇద్దరిని ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం తన పిటిషన్లో కోరింది. ఇప్పటికే వీరు రివ్యూ పిటిషన్, క్యురేటివ్, క్షమాభిక్ష అభ్యర్థనలన్నింటినీ వినియోగించుకున్నారని తెలిపింది. నలుగురు దోషుల్లో పవన్ గుప్తా మాత్రమే ఇప్పటి వరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేయలేదు.