Hazipur: హాజీపూర్ వరుస హత్యల కేసు.. కాసేపట్లో వెలువడనున్న తీర్పు!
- శ్రీనివాస్ రెడ్డిపై నేరం రుజువైనట్టు నిర్ధారణ
- కాసేపట్లో శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం
- తనను కావాలనే ఈ కేసుల్లో ఇరికించారన్న నిందితుడు
నల్గొండ జిల్లా హాజీపూర్ లో వరుస హత్యలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక ఫోక్సో కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. మూడు హత్యల కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిపై నేరం రుజువైనట్టు న్యాయస్థానం నిర్ధారించింది. ఆయా కేసుల్లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. శ్రావణి, కల్పన, మనీషలను హతమార్చింది శ్రీనివాస్ రెడ్డే అని, అందుకు తగిన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టు ఎదుట ఉంచారు. ఈ కేసులో తీర్పును లంచ్ తర్వాతకు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కాసేపట్లో న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్నట్టు సమాచారం.
కాగా, తనను కావాలనే ఈ కేసుల్లో ఇరికించారని విచారణ సమయంలో న్యాయస్థానంలో శ్రీనివాసరెడ్డి రోదించినట్టు సమాచారం. ‘నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసా? అసలు, మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అని శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా, తనకు తెలియదని అతను సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు తనను కొట్టి ఒప్పించారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించినట్టు సమాచారం.