sajjala Ramakrishna Reddy: ప్రజలు తిరస్కరించినా.. టీడీపీ నేతల వైఖరి మారలేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
- రైతుల పేరుతో టీడీపీ కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు
- రాజధాని ప్రాంతంలోనే లోకేశ్ ను తిరస్కరించారు
- అన్నివర్గాల ప్రజలు జగన్ ను ఆశీర్వదించారు
అమరావతి రాజధాని కోసం టీడీపీ నేతల ఆధ్వర్యంలో సాగుతోన్న ఉద్యమాన్ని వైసీపీ నేత, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలు తమ స్వార్థం కోసమే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. టీడీపీని ప్రజలు తిరస్కరించినప్పటికీ, ఆ నేతల్లో మార్పు రాలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై లెక్కలేనితనంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారన్నారు.
చంద్రబాబు చెప్పే రాజధాని ప్రాంతంలోనే లోకేశ్ ను ప్రజలు తిరస్కరించారన్నారు. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేబట్టే ఆయనను గెలిపించలేదని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో రాజధాని ఏర్పాటులో అసంబద్ధ నిర్ణయాలు తీసుకున్నారని సజ్జల ధ్వజమెత్తారు. తాజాగా టీడీపీ కార్యకర్తలు రైతుల పేరుతో హడావిడి చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు జగన్ ను ఆశీర్వదించారని చెప్పారు. రాజధానిని మార్చలేదని చెబుతూ.. రాజధానిలో రెండు విభాగాలను తరలించడానికి నిర్ణయం చేశామన్నారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ విభాగాలను తరలించామన్నారు.
రాజధాని ప్రక్రియను వారు చేసిన దానికంటే మెరుగ్గా తాము చేశామన్నారు. స్థానిక రైతులకు బాధ ఉంటుందని, వారికి తగిన న్యాయం చేస్తామని అన్నారు. రైతులను కావాలనే తాము ఏదో చేస్తున్నామన్న భావన పోవాలన్నారు. వారు న్యూనతా భావంనుంచి బయటపడాలన్నారు. వారికి తగిన న్యాయం చేయడానికి సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారన్నారు.