E calculator: ఐటీ రిటర్న్ దాఖలులో ‘ఈ కాలిక్యులేటర్’ సౌకర్యం
- ఈ ఫైలింగ్ వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చిన ఐటీ శాఖ
- పన్ను చెల్లించడానికి పాత, కొత్త పద్ధతులు
- రెండింటి మధ్య మిగులును గణించడానికి కాలిక్యులేటర్ తో వెసులుబాటు
ఆదాయపు పన్ను కట్టడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు పద్ధతులు (పాత, కొత్త) అందుబాటులో ఉంటాయని ఇటీవల బడ్జెట్ లో ప్రకటించిన నేపథ్యంలో.. ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులు ఈ రెండు పద్ధతుల్లో దేన్ని ఎంపిక చేసుకుంటే ఎంత మేరకు తమకు మిగులుతుందో సరిచూసుకోవడానికి ‘ఈ కాలిక్యులేటర్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కాలిక్యులేటర్ ద్వారా పన్ను చెల్లింపుదారులు పాత విధానంలో.. కొత్త విధానంలో పన్నును ఎంతమేర చెల్లించాలో తెలుసుకునే వీలుంటుంది.
ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకుని చెల్లింపుదారులు తమ ఈ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. కాగా ఈ కాలిక్యులేటర్ ను ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లో ఉంచినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం పన్ను శ్లాబులను పెంచిన విషయం తెలిసిందే. అలాగే, పాత శ్లాబ్ విధానం కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే చెల్లింపుదారులు కొత్త శ్లాబ్ విధానాన్ని వాడుకుంటే.. ఎలాంటి మినహాయింపులు వర్తించబోవంటూ పేర్కొంది. గత విధానం ప్రకారం వందకు పైగా మినహాయింపులుండగా, కొత్త శ్లాబ్ విధానం ప్రకారం ఈ మినహాయింపుల్లో చాలావరకు తొలగించింది.