Li Wenliang: కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని ముందే హెచ్చరించిన యువ వైద్యుడి మృతి!
- ‘సార్స్’ లాంటి వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందంటూ ముందే హెచ్చరించిన లీ
- అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఈ తెల్లవారుజామున 2:58 గంటలకు మృతి
కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందంటూ ముందే హెచ్చరించిన చైనా యువ వైద్యుడు డాక్టర్ లీ వెన్లియాంగ్ (34) ఈ తెల్లవారుజామున అదే వైరస్ బారినపడి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన పనిచేసిన వుహాన్ సెంట్రల్ ఆసుపత్రి ప్రకటించింది. సీఫుడ్ మార్కెట్కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆమధ్య అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన డాక్టర్ లీ వారిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ వైరస్ తీవ్ర ప్రమాదకరమని గుర్తించిన లీ.. ఇది మరింత విస్తరించి ప్రాణాలు బలిగొనే అవకాశం ఉందని ప్రపంచాన్ని హెచ్చరిస్తూ గతేడాది డిసెంబరు 30న సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘సార్స్’ లాంటి ప్రమాదకర వైరస్ వుహాన్లో విస్తరిస్తోందని హెచ్చరించారు. ఈ పోస్టును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతడిని ఇబ్బంది పెట్టింది. వైరస్ గురించి అపోహలు ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కాగా, ఆ తర్వాత అదే వైరస్ బారిన ఆయన పడ్డారు. గత నెల 12 నుంచి చికిత్స పొందుతున్న లీ గురువారం అర్ధరాత్రి దాటాక 2:58 గంటలకు కన్నుమూశారు. ఆయనను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు.