IYR Krishna Rao: చరిత్రలో మరుగున పడిన విషయాలను ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.. సంతోషకరం: ఐవైఆర్
- నెహ్రూని ప్రధానిని చేయడానికే దేశాన్ని విభజించారన్న మోదీ
- 70 ఏళ్లుగా చరిత్రను మనం ఒక్క కోణంలోనే చదివామన్న ఐవైఆర్
- ప్రశ్నలకు సమాధానాలను వెతకాలని వ్యాఖ్య
నిన్న పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నెహ్రూను ప్రధానిగా చేయడం కోసమే దేశాన్ని రెండుగా విభజించారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మైనార్టీల రక్షణ కోసం నెహ్రూ చేసుకున్న ఒప్పందాన్నే సీఏఏ రూపంలో తాము అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. సీఏఏపై ఎవరైనా అభిప్రాయాలను చెప్పొచ్చని... కానీ, అబద్ధాలు మాత్రం తగవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... చరిత్రలో మరుగున పడిపోయిన కొన్ని విషయాలను ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తోందని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. 70 ఏళ్లుగా మనం చరిత్రను ఒక్క కోణంలోనే చదివామని... అందువల్ల ఈ ప్రశ్నలు వివాదాస్పదమైనవనే భావన మనలో కలగవచ్చని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం, వామపక్ష ఉదారవాదులు కలిసి కొందరు నాయకులకు దైవత్వాన్ని ఆపాదించి, చర్చకు తావు లేకుండా చేశారని అభిప్రాయపడ్డారు. ప్రశ్నలకు సమాధానాలను వెతకాలే కానీ, ప్రశ్నించిన వారిని విమర్శించడం సరికాదని అన్నారు.