Marnus Labuschagne: అతడిలో ఏదో విషయం దాగివుంది: ఆసీస్ క్రికెటర్ లబుషేన్ పై సచిన్ వ్యాఖ్యలు
- సబ్ స్టిట్యూట్ గా వచ్చి పాతుకుపోయిన ఆసీస్ క్రికెటర్ లబుషేన్
- నమ్మశక్యం కాని రీతిలో పరుగుల వరద
- టెస్టుల్లో సగటు 63 పైమాటే!
- అచ్చం తనలాగే ఆడుతున్నాడన్న సచిన్
గత ఆగస్టులో ఇంగ్లాండ్ తో టెస్టు సందర్భంగా స్మిత్ గాయపడడంతో అతడి స్థానంలో కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ లబుషేన్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ ఆసీస్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2019 ఆగస్టు 14 నుంచి అతడి టెస్టు కెరీర్ చూస్తే... 59, 74, 80, 67, 11, 48, 14, 185, 162, 143, 50, 63, 19, 215, 59... ఇలా సాగింది. టెస్టుల్లో అతని సగటు 63. నమ్మశక్యం కాని రీతిలో పరుగులు వెల్లువెత్తిస్తూ నయా సంచలనంలా మారిన లబుషేన్ పై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు.
లబుషేన్ టెక్నిక్ చూస్తుంటే అచ్చం తన టెక్నిక్ లాగా ఉందని అచ్చెరువొందాడు. అతడిలో ఏదో విషయం దాగివుందనిపిస్తోందని, అతడి ఫుట్ వర్క్ అమోఘం అని కొనియాడాడు. అచ్చం తనలాగానే ఆడుతున్నాడని కితాబిచ్చాడు. దీనికి ఐసీసీ కూడా స్పందించి, లబుషేన్ కు లభించిన ప్రశంసల్లో ఇదే అత్యుత్తమం అని పేర్కొంది. ప్రస్తుతం సచిన్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కార్చిచ్చు బాధితుల సహాయార్థం మాజీ క్రికెటర్ల మ్యాచ్ లో సచిన్ కూడా పాల్గొంటున్నాడు.