China: కరోనా వైరస్ దీనివల్లే వ్యాపిస్తోందట.. కొత్త జీవి పేరు చెప్పిన చైనా శాస్త్రవేత్తలు!
- పాములు, గబ్బిలాల ద్వారా వస్తుందని తొలుత చెప్పిన శాస్త్రవేత్తలు
- తాజాగా అలుగు వల్ల వస్తుందని వెల్లడించిన వైనం
- అలుగు జన్యుక్రమంతో వైరస్ 99 సరిపోలుతోందన్న శాస్త్రవేత్తలు
ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తోందన్న దానిపై చైనా శాస్త్రవేత్తలు చెబుతున్న దాంట్లో ఒకదానికి ఒకటి పొంతన ఉండడం లేదు. పాములు, గబ్బిలాల వల్లే కరోనా వైరస్ వచ్చి ఉంటుందని తొలుత చెప్పిన శాస్త్రవేత్తలు తాజాగా, అలుగు (పాంగొలిన్) కూడా ఇందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. వీటి జన్యుక్రమం కరోనా కొత్త తరహా వైరస్‌తో 99 శాతం సరిపోలుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనా సహా మరికొన్ని దేశాల్లోనూ అలుగులను తింటారు. దీంతో వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉంటుందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 636కి చేరగా, 31,161 మందికి సోకినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఒక్క రోజులో 73 మంది మృతి చెందగా, వారిలో 69 మంది మంది హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. మరోవైపు, ఐరోపా దేశాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. ఆయా దేశాల్లో 31 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.