Holydip: మాఘపౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు పోటెత్తిన జనం
- సాగరతీరం, నదీ సంగమ స్థానాల్లో రద్దీ
- హంసల దీవి, భీమిలి, విశాఖ, కోస్తా సాగరతీరాల్లో రద్దీ
- తెల్లవారు జాము నుంచే పుణ్యస్నానాలు
మాఘపౌర్ణమి సందర్భంగా నదీసాగర సంగమ స్థానాలు, సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రాలోని కోస్తాతీరంలోని పలు ప్రాంతాలతోపాటు హంసల దీవి, భీమిలి బీచ్ వంటి నదీ సంగమ స్థానాలు భక్తజన సంద్రమయ్యాయి. మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం. నెలంతా వీలుకాకుంటే కనీసం మాఘ పూర్ణిమ రోజైనా పవిత్ర నదులు, సముద్రంలో స్నానం ఆచరిస్తే నెలంతటి ఫలితం కలుగుతుందని ఓ నమ్మకం. ఈ కారణంగా ఈరోజు తెల్లవారు జాము నుంచి భక్తులు నదీసాగర సంగమ స్థలాలు, తీరప్రాంతాల్లో స్నానాలకు పోటెత్తారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి సమీపంలోను, విశాఖ జిల్లా భీమిలిలోని నదీ సాగర సంగమ స్థానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కోస్తా తీరం అంతటా భక్తుల రద్దీ కనిపించింది. సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.