TG Venkatesh: మూడు రాజధానుల అంశం తనకు ముందే ఎలా తెలిసిందో చెప్పిన టీజీ!
- ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపిన టీజీ
- జగన్ ఒంగోలు వద్ద కూడా రాజధాని తేవాలనుకున్నాడని వెల్లడి
- సమస్యాత్మకం కావడంతో విరమించుకున్నాడని వ్యాఖ్యలు
ఏపీలో రాజధానుల విభజన జరగబోతోందన్న అంశాన్ని అందరికంటే ముందు వెల్లడించిన వ్యక్తి టీజీ వెంకటేశ్! మూడు రాజధానుల అంశం తనకు ముందే ఎలా తెలిసిందో టీజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, సీఎం జగన్ ఢిల్లీలో ఓ జాతీయ నాయకుడితో భేటీ అయ్యాడని, రాజధానుల అంశాన్ని జగన్ ఆయనతో పంచుకున్నాడని టీజీ వివరించారు. ఆ జాతీయ నాయకుడు అమరావతి నుంచి రాజధాని తరలిపోవచ్చంటూ తమకు వివరాలు చెప్పాడని తెలిపారు.
ఆ సమయంలో జగన్ నాలుగు ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయడంతో నాలుగు రాజధానులు వస్తాయని ఊహించామని, ఒంగోలు వద్ద ఓ రాజధాని వస్తుందని భావించామని వెల్లడించారు. అయితే ఒంగోలు వద్ద రాజధాని సమస్యాత్మకం కావడంతో అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. రాజధానులపై ప్రకటన రాకముందే వైసీపీ మంత్రులు ప్రజల్లో విద్వేషం రేకెత్తించే వ్యాఖ్యలు చేశారని, అమరావతి రాజధానిగా పనికిరాదని, రాజధాని ఇక్కడ కొనసాగదని ప్రచారం చేశారని తెలిపారు. ఎంతో స్తబ్దుగా ఉన్న చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు ఈ పరిణామాలు ఎంతో ఉపయోగపడ్డాయని టీజీ అభిప్రాయపడ్డారు.