Supreme Court: రాష్ట్రాలదే అధికారం... ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు!
- 2012 నాటి ఉత్తరాఖండ్ కేసులో తీర్పు
- రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదు
- నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనన్న సుప్రీం
ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుందని, ఈ విషయంలో రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఎవరికీ ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. నియామకాల్లో రిజర్వేషన్లకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించింది. ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలనడం ప్రాథమిక హక్కేమీ కాదని పేర్కొంది.
కాగా, 2012లో ఉత్తరాఖండ్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ నోటిఫికేషన్ ను రాష్ట్ర హైకోర్టులో సవాలు చేయగా, నోటిఫికేషన్ ను కొట్టేస్తున్నట్టు అప్పట్లో న్యాయమూర్తి ప్రకటించారు. ఇక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టుకు పిటిషన్లు రాగా, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం కేసును విచారించి, ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోటిఫికేషన్ను సమర్ధిస్తూ, హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కచ్చితంగా కల్పించాలనే నిబంధన లేదని, రాష్ట్రాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించుకుని రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని పేర్కొంది. అంతకుముందు ఆయా వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం లేదని నిరూపించే కచ్చితమైన గణాంకాలు సేకరించి, రిజర్వేషన్లు కల్పించవచ్చని తెలియజేసింది.