Amaravati: ‘అమరావతి’పై ఆందోళన.. మనస్తాపంతో మరో రైతు మృతి
- రాజధాని కోసం 31 సెంట్ల భూమి
- ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న రైతు చంద్రం
- మనస్తాపంతో కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలింపును నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో తొలి నుంచీ పాల్గొంటున్న తుళ్లూరు రైతు కంచర్ల చంద్రం (43) మనస్తాపంతో మృతి చెందాడు. రాజధాని కోసం చంద్రం తనకున్న 31 సెంట్ల అసైన్డ్ భూమిని ప్రభుత్వానికి ఇచ్చాడు.
అయితే, ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తన మనసు మార్చుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు చంద్రం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.