IYR Krishna Rao: ఈ వార్త ఎందుకో పొసగడం లేదు: ఐవైఆర్ కృష్ణారావు
- 1980 నుంచి ఆటో నగర్ విజయవాడలో కోట్ల వ్యాపారం చేస్తోంది
- పోలవరం, అమరావతికి సంబంధం లేకుండా వ్యాపారం జరుగుతోంది
- పోలవరం, అమరావతి వలన ఆటోనగర్ కార్మికులు దెబ్బతిన్నారని రాశారు
- ఈ వార్త బోడి గుండుకి, మోకాలుకి లింకు లాగా ఉంది
అమరావతి రాజధాని అంశంతో పాటు పోలవరం పనులు జరగని కారణంగా ఆటోనగర్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు.. 'ఈ వార్త ఎందుకో పొసగడం లేదు' అంటూ ట్వీట్ చేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద 'ఆటోనగర్' అయినప్పటికీ కార్మికులు వలస బాట పట్టారని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా నాలుగు లక్షల మందికి ఆటోనగర్లో ఉపాధి లభించేదని, వాహనాల విడి భాగాల కోసం చాలా మంది ఇక్కడకు వచ్చే వారని, ఇప్పుడు దుకాణాలు ఖాళీ అవుతున్నాయని కథనంలో తెలిపారు.
ఈ కథనంపై ఐవైఆర్ స్పందిస్తూ... 'ఈ వార్త ఎందుకో పొసగడం లేదు. నాకు తెలిసి 1980 నుంచి ఆటో నగర్ విజయవాడలో కోట్ల వ్యాపారం చేస్తూ ఉంది. పోలవరం, అమరావతికి సంబంధం లేకుండా ఆటోనగర్ ఉంది. పోలవరం, అమరావతి వలన సిమెంటు స్టీల్ రంగాలు దెబ్బతిన్నాయి అంటే అర్థం ఉంది గాని ఆటో నగరానికి వాటికి లింకు పెట్టడం బోడి గుండు మోకాలు లింకు లాగా ఉంది' అని విమర్శించారు.