Electricity: ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు
- 500 యూనిట్లకు పైగా వినియోగించే వారిపై భారం
- యూనిట్ కు 90 పైసలు చొప్పున పెంపు
- విద్యుత్ సబ్సిడీని ఉపసంహరించుకునే యోచనలో ప్రభుత్వం
ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 500 యూనిట్లకు పైబడి వినియోగించేవారికి యూనిట్ కు 90 పైసలు చొప్పున ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 500 యూనిట్లకు పైబడి వినియోగిస్తున్నవారికి యూనిట్ కు రూ 9.05 ఉండగా... ప్రస్తుతం రూ. 9.95 కి పెరిగింది.
ఈ సందర్భంగా ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 14,349.07 కోట్ల ఆదాయం అవసరమవుతుందని... లోటును భర్తీ చేసేందుకే విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని... అందువల్ల ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొలుగోలును నిరాకరించామని చెప్పారు. క్రమంగా విద్యుత్ సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై అభ్యంతరాలు ఉన్నవారు కోర్టులను ఆశ్రయించవచ్చని చెప్పారు.