Muthyala Subbaiah: నా దగ్గర అసిస్టెంట్ గా చేసిన వ్యక్తి దగ్గరే నేను కో డైరెక్టర్ గా చేయవలసి వచ్చింది: దర్శకుడు ముత్యాల సుబ్బయ్య
- అసిస్టెంట్ డైరెక్టర్ గా తొలి సినిమా 'సిసింద్రీ చిట్టిబాబు'
- దర్శకుడిగా మొదటి సినిమా 'మూడు ముళ్ల బంధం'
- ఇగోలకు పోకుండా ఆ సినిమా చేశానన్న ముత్యాల సుబ్బయ్య
ఎన్నో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి, విజయాలను అందుకున్న దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యకి మంచి పేరు వుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "సినిమాలపట్ల ఆసక్తితో చెన్నై చేరుకున్న నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా 'సిసింద్రీ చిట్టిబాబు' సినిమాకి పనిచేసే అవకాశం లభించింది.
అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా .. కో డైరెక్టర్ గా చాలా సినిమాలకి పనిచేస్తూ వెళుతున్నాను. ఆ సమయంలో నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. అలా నేను దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం 'మూడుముళ్ల బంధం'. ఈ సినిమాకి మంచి పేరు వచ్చిందిగానీ, ఆ తరువాత నాకు వెంటనే అవకాశాలు రాలేదు.
అలాంటి పరిస్థితుల్లో .. అంతకు ముందు నా దగ్గర అసిస్టెంట్ గా చేసిన విజయ్ భాస్కర్ దగ్గర నేను కో డైరెక్టర్ గా చేయవలసి వచ్చింది. విజయ్ భాస్కర్ కి 'ఇది పెళ్లంటారా' చేసే అవకాశం వచ్చింది. కో డైరెక్టర్ గా చేయమని అడిగాడు .. కానీ అప్పటికే నేను డైరెక్టర్ ని. ఓ వైపున భార్య .. ముగ్గురు పిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇగోలకు వెళ్లకూడదని భావించి, ఆ సినిమాకి కో డైరెక్టర్ గా చేయడానికి అంగీకరించాను" అని చెప్పుకొచ్చారు.