Yanamala: ఏం చేయాలనేది రెండు రోజుల్లో తేలుస్తాం: సెలక్ట్ కమిటీ వ్యవహారంపై యనమల
- మండలి కార్యదర్శికి ధిక్కరణ నోటీసులు ఇస్తాం
- మండలిలో చర్చించి అప్పటికప్పుడే నిర్ణయాన్ని ప్రకటిస్తాం
- ఉమ్మారెడ్డిలాంటి వాళ్లు పుస్తకాలను చదవాలి
శాసనమండలి కార్యదర్శిపై పీనల్ యాక్షన్ తీసుకుంటామని... మండలి ధిక్కరణ కింద నోటీసులు ఇస్తామని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. కార్యదర్శిపై మండలిలో చర్చించి అప్పటికప్పుడే నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఏం చేయాలనేది రెండు రోజుల్లో తేలుస్తామని అన్నారు.
మండలి ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించారంటూ కార్యదర్శికి శిక్ష విధిస్తే డీజీపీ అమలు చేయరా? అని ప్రశ్నించారు. చెడు సంప్రదాయాలకు తెర తీయవద్దని అన్నారు. వైసీపీ నేత ఉమ్మారెడ్డిలాంటి వాళ్లు పుస్తకాలను లోతుగా చదవాలని సూచించారు. బిల్లులు సెలెక్ట్ కమిటీ వద్ద ఉన్నప్పుడు ఆర్డినెన్సులను ఇవ్వలేరని చెప్పారు. ఆర్డినెన్స్ లను గవర్నర్ ఆమోదించలేరని తెలిపారు. ఇవన్నీ కోర్టులో నిలబడవని అన్నారు.