Jagan: 'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్
- బస్సులో మహిళకు తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులు
- దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన మహిళ
- ఏడు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్న మొబైల్ పోలీస్ పార్టీ
ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశ యాప్ అప్పుడే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న ఓ ఎక్సైజ్ ఉద్యోగిని తనకు సహ ప్రయాణికుడి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.
ఆమె ఎస్ఓఎస్ బటన్ నొక్కడంతో, ఆ సంకేతాలను మంగళగిరిలోని పోలీస్ కంట్రోల్ రూం స్వీకరించింది. ఈ ఘటన జరిగింది తెల్లవారుజామున 4 గంటలకు. పోలీసులు కేవలం 7 నిమిషాల్లోనే బాధితురాలి వద్దకు చేరుకుని ఆమెను భౌతికంగా వేధిస్తున్న ఓ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడో అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్ పోలీసుల సత్వర స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. యావత్ పోలీసు విభాగాన్ని అభినందిస్తున్నానంటూ చప్పట్లు కొట్టారు. "ప్రభుత్వ పథకాలు సవ్యంగా అమలవుతున్నాయని చెప్పడానికి ఈ ఘటన ఓ నిదర్శనం అని గౌతమ్ అన్న వెల్లడించిన సమాచారంతో స్పష్టమవుతోంది. బాధిత మహిళ ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే ఏడు నిమిషాల్లో మొబైల్ పోలీస్ పార్టీ సంఘటన స్థలానికి చేరుకున్నందుకు పోలీసులందరికీ నా అభినందనలు" అంటూ వ్యాఖ్యానించారు.