Rajasekhar: కరోనా నేపథ్యంలో డాక్టర్లు, నర్సుల పట్ల హీరో రాజశేఖర్ సానుభూతి
- చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్
- వెయ్యికి సమీపిస్తున్న మృతుల సంఖ్య
- పలువురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్
- ఆందోళన వ్యక్తం చేసిన రాజశేఖర్
చైనాలో ప్రబలిన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరణించినవారి సంఖ్య వెయ్యికి సమీపిస్తోంది. వైరస్ సోకిన వారి సంఖ్య 40 వేలు దాటింది. బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. దీనిపై టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ స్పందించారు. కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో సైనికుల్లా పోరాడుతున్నారంటూ డాక్టర్లు, నర్సులను కొనియాడారు. మీరు చేస్తున్న సేవలకు చేతులెత్తి దండం పెట్టాలి అంటూ ట్విట్టర్ లో స్పందించారు.
"మీరు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాం. కరోనా వైరస్ సోకకుండా మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి" అంటూ సూచించారు. సినిమాల్లోకి రాకముందు రాజశేఖర్ కూడా డాక్టరేనన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బహిర్గతమై కొన్ని వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎవరూ డాక్టర్ల గురించి స్పందించకపోగా, స్వయానా డాక్టర్ కావడంతోనే రాజశేఖర్ వైద్యసిబ్బంది ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.