CPI: శాసనసభకున్న అధికారాలు, శాసనమండలికి కూడా ఉన్నాయన్న విషయాన్ని వైసీపీ సర్కారు విస్మరిస్తోంది: సీపీఐ నేత రామకృష్ణ
- శాసన సభలో సంఖ్యాబలంతో బిల్లును నెగ్గించుకున్నారు
- గత ప్రభుత్వం పరిశ్రమలకు భూములిచ్చింది
- వైసీపీ హయాంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి
ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ రోజు అనంతపురంలో ఉన్న కియా కంపెనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. చట్ట సభల్లో రూపొందించిన శాసనాలనే అధికారులు ధిక్కరించే పరిస్థితి వైసీపీ పాలనలో కనిపిస్తోందన్నారు.
శాసన సభలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును నెగ్గించుకుందని విమర్శించారు. రాజ్యాంగంలో శాసనసభకున్న అధికారాలు, శాసనమండలికి కూడా ఉన్నాయన్న విషయాన్ని వైసీపీ సర్కారు విస్మరిస్తోందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కియా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చిందని చెబుతూ.. వైసీపీ సర్కారు ధోరణితో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని సీపీఐ నేత అన్నారు.