CBI: జగన్ కు ‘వ్యక్తిగత మినహాయింపు’ వద్దు: కౌంటర్ పిటిషన్ లో సీబీఐ
- బెయిల్ షరతులను జగన్ అతిక్రమిస్తున్నారు
- కోర్టుకు హాజరు కాకుండా బయటపడాలని చూస్తున్నారు
- హాజరు మినహాయింపు కోరడం నిందితుల హక్కు కాదు
కోర్టుకు హాజరు కాకుండా తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్నసీఎం జగన్ పిటిషన్లపై నిన్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. బెయిల్ షరతులను జగన్ అతిక్రమిస్తున్నారని, కోర్టుకు హాజరుకావడం నుంచి ఏదో ఒక కారణంతో ఆయన బయటపడాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. రాజకీయ, ధన బలాలను ఉపయోగించి సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో పేర్కొంది.
అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొదటి చార్జిషీట్ దాఖలై ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ విచారణ ప్రారంభం కాలేదని, జగన్ సహా ఇతర నిందితులు ఏదో నెపంతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని పేర్కొంది. జాప్యం జరుగుతోందంటూనే జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని, ఆర్థిక కుంభకోణం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని జగన్ కు మినహాయింపు ఇవ్వొద్దని కోరింది. జగన్ సీఎం అయ్యాక విచారణ నిమిత్తం కేవలం ఒక్కసారే ఆయన సీబీఐ కోర్టుకు హాజరయ్యారని గుర్తుచేసింది. సీఎం అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారినట్టు కాదని, హాజరు మినహాయింపు కోరడం నిందితుల హక్కు కాదని, కోర్టు విచక్షణకు సంబంధించిందని తెలిపింది.
సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు తీసుకుంటూనే ఉన్న జగన్, సరైన కారణం లేకుండానే తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మళ్లీ పిటిషన్ వేశారని, హోదా మారిందన్న కారణంగా ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని తన కౌంటర్ లో పేర్కొంది. సీబీఐ, ఈడీతో కలిపి వేసిన 16 చార్జిషీట్లలో జగన్ నిందితుడిగా ఉన్నారని, నేర విచారణ నిందితుల సమక్షంలో జరగాలని క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్ పీసీ) చెబుతోందని తెలిపింది. కాగా, జగన్ పిటిషన్లపై ఏప్రిల్ 9న హైకోర్టులో విచారణ జరగనుంది.