Arvind Kejriwal: ఎనిమిది చోట్ల ఎందుకు ఓడిపోయాం?.. సీనియర్ నేతలతో కేజ్రీవాల్ సమీక్ష.. పలు సూచనలు
- ఈ ఎనిమిది స్థానాల్లో పార్టీ నేతలంతా ప్రజలతో మమేకం కావాలి
- ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి
- ఈ స్థానాలపై మరింత దృష్టిని సారిద్దాం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హస్తిన పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సర్వశక్తులు ఒడ్డినా... కేజ్రీవాల్ క్రేజ్ ముందు బీజేపీ చతికిల పడింది. 70 సీట్లకు గాను కేవలం 8 చోట్ల మాత్రమే గెలుపొందింది. 62 స్థానాలను గెలుచుకొన్న కేజ్రీవాల్ ఢిల్లీలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. అయినా, మిగిలిన ఎనిమిది చోట్ల ఓడిపోవడంపై కేజ్రీవాల్ దృష్టి సారించారు.
ఎనిమిది స్థానాల్లో ఓటమిపాలు కావడంపై కేజ్రీవాల్ సమీక్ష నిర్వహించారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఆప్ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. ఓడిపోయిన ప్రతి నియోజకవర్గంపై వీరు లోతుగా చర్చించారు. ఈ స్థానాల్లో ఓటమిపాలైన ఆప్ అభ్యర్థులు కూడా ఓటమికి గల కారణాలను వివరించారు.
ఈ సమావేశం సందర్భంగా పార్టీ నేతలకు కేజ్రీవాల్ పలు సూచనలు చేశారు. ఈ ఎనిమిది స్థానాల్లో పార్టీ నేతలంతా ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, వారికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గ ప్రజలకు వివరించాలని చెప్పారు. ఓటమిపాలైన స్థానాలపై మరింత దృష్టిని సారిద్దామని తెలిపారు. మరోవైపు, ఈనెల 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.