Vihari: ప్రాక్టీసు మ్యాచ్ లో టీమిండియాను ఆదుకున్న తెలుగుతేజం
- న్యూజిలాండ్ ఎలెవెన్ తో టీమిండియా సన్నాహక మ్యాచ్
- తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైన టీమిండియా
- సెంచరీతో రాణించిన హనుమ విహారి
- 93 పరుగులు చేసి అవుటైన పుజారా
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ముంగిట కఠినమైన టెస్టు సిరీస్ సవాల్ నిలిచింది. రెండు టెస్టుల సిరీస్ కు ముందు టీమిండియా పరిస్థితులకు అలవాటుపడేందుకు ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతోంది. న్యూజిలాండ్ ఎలెవన్ జట్టుతో హామిల్టన్ లో ఇవాళ ప్రారంభమైన మూడ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆటలో కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ఓపెనర్లు పృథ్వీ షా (0), మయాంక్ అగర్వాల్ (1) మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పెవిలియన్ చేరారు. ఆపై వర్ధమాన ఆటగాడు శుభ్ మాన్ గిల్ డకౌట్ కాగా, రహానే 18 పరుగులతో నిరాశపరిచాడు.
ఈ దశలో తెలుగుతేజం హనుమ విహారి (101), సీనియర్ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (93) ఆదుకోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో సహనం ప్రదర్శించిన విహారి శతకంతో మెరిశాడు. 182 బంతులు ఆడిన విహారి 10 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. సెంచరీ పూర్తయిన తర్వాత రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగాడు. పుజారా కూడా ఎంతో ఓపిగ్గా ఆడి ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. పంత్ (7), సాహా (0), జడేజా (8) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. న్యూజిలాండ్ ఎలెవెన్ బౌలర్లలో స్కాట్ కుగెలీన్ 3, ఇష్ సోధీ 3, జేక్ గిబ్సన్ 2 వికెట్లతో రాణించారు.