- త్వరలోనే రామాలయం పనులు వేగవంతం అవుతాయి
- మన సంస్కృతే మన దేశానికి ఐడెంటిటీ
- యూపీ పర్యటనలో ప్రధాన మంత్రి వెల్లడి
అయోధ్యలో రామాలయం నిర్మించే దిశగా మరో పెద్ద నిర్ణయం తీసుకున్నామని, ఆలయం నిర్మించేందుకు ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టుకు మొత్తం 67 ఎకరాల భూమిని అప్పగించనున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులంలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
త్వరలోనే అప్పగిస్తాం
‘‘కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామాలయం నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రాముడు జన్మించిన స్థలాన్ని మొత్తం 67 ఎకరాలను కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు త్వరలో అప్పగించనున్నాం. ఆలయం నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతాయి’’ అని నరేంద్ర మోదీ తెలిపారు.
మన సంస్కృతే గుర్తింపు
మన సాంప్రదాయాలు, సంస్కృతులే మన దేశానికి గుర్తింపు అని, అది పాలకులు నిర్ణయించేది కాదని మోదీ పేర్కొన్నారు. ‘‘ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నదాన్ని బట్టి మన దేశానికి ఎప్పుడూ గుర్తింపు లేదు. పాలకులు, అధికారాన్ని బట్టి కాకుండా.. దేశ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను బట్టి మన దేశానికి ఐడెంటిటీ వచ్చింది.’’ అని చెప్పారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.