Laxman: ఒవైసీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు:బీజేపీ నేత లక్ష్మణ్
- భైంసాలో అల్లర్లకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
- భద్రత కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారు
- మజ్లిస్ పార్టీ ఆగడాలను అరికట్టాలి
తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత ఒవైసీపై టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భైంసాలో జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ అల్లర్లకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, టీఆర్ఎస్సే వహించాలని డిమాండ్ చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ ఆగడాలను అరికట్టకపోతే భైంసా లాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా జరిగే ప్రమాదం ఉందని అన్నారు.
హైదరాబాద్ లో తాము అనుభవించిన బాధలు ఈరోజున భైంసాలో ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. ఎంఐఎం అధినేత ఒవైసీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీఆర్ఎస్ కూ పడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు.