BJP: టీడీపీ, వైసీపీకి సమదూరంలో బీజేపీ ఉంటుంది: కన్నా లక్ష్మీనారాయణ
- ఆ రెండు పార్టీలపై అదే మా పార్టీ వైఖరి
- కడపలో పోలీసుల అక్రమ కేసులను నిరసిస్తున్నాం
- ఈ నెల 19న ధర్నా నిర్వహిస్తాం
ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి కాబోతోందన్న వార్తల నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీకి సమదూరంలో బీజేపీ ఉంటుందని, అదే తమ పార్టీ వైఖరి అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ ఢిల్లీ పర్యటన గురించిన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అండదండలతోనే రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావిస్తూ, ప్రజలను మోసం చేసేందుకే ఈ నిర్ణయం అని విమర్శించారు. సీఏం మారితే రాజధానిని తరలిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. అవినీతిని చూపించి రాజధానిని తరలిస్తున్నామనడం కరెక్టు కాదని, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఏపీలో ఇసుక దోపిడీపై ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేస్తున్నా జగన్ కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు.
ఈ విషయమై డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కడపలో పోలీసుల అక్రమ కేసులను నిరసిస్తూ ఈ నెల 19న ధర్నా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విశాఖ భూ కుంభకోణంపై చర్యలు ఎందుకు చేపట్టడం లేదని జగన్ ని ప్రశ్నించారు.