Car Number: రెండు కార్లకు ఒకే నంబర్... తనకు వచ్చిన చలాన్లు చూసి అవాక్కైన మహిళా డాక్టర్!
- డాక్టర్ వద్ద హోండా జాజ్ కారు
- అదే నంబర్ తో తిరుగుతున్న ఓల్వో కారు
- ఓవర్ స్పీడ్ చలాన్ రావడంతో విషయం బట్టబయలు
తన కారు ఓవర్ స్పీడ్ గా వెళ్లిందని ఓ చలాన్ రాగా, దాన్ని చూసిన ఓ మహిళా డాక్టర్ అవాక్కై, పోలీసుల వద్దకు పరుగులు పెట్టారు. ఆ కారు తనది కాదని, తన కారు నంబర్ ను మరొకరు వాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, తప్పుడు నంబర్ వాడుతున్న హై ఎండ్ కారు ఎవరిదో తేల్చేందుకు రంగంలోకి దిగారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్ లో నివసించే కె.వనజా రఘునందన్ డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఈమె పేరిట హోండా జాజ్ కారు 'టీఎస్ 09 ఈఎల్ 5679' నంబర్ తో రిజిస్టర్ అయి ఉంది. గత నెల 20న మహబూబ్ నగర్ జిల్లాలో కారు వేగ పరిమితికి మించి ప్రయాణించినట్టు చలాన్ వచ్చింది. ఆ రోజు తాను ఎక్కడికీ వెళ్లలేదని గుర్తు చేసుకున్న ఆమె, కారు ఫొటోను చూసి, కారు కూడా తనది కాదని గుర్తించారు.
ఎవరో తన కారును వాడుతున్నారని ఆరోపిస్తూ, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కారు నంబర్ ను మార్చి నడుపుతున్న అతని వల్ల తాను ఇబ్బందుల్లో పడవచ్చని ఆందోళన చెందారు. కేసును రిజిస్టర్ చేసుకున్న పోలీసులు సదరు ఓల్వో కారు కోసం గాలిస్తున్నారు.