Airindia: చైనాకు అన్ని విమాన సర్వీసులు నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయం!
- చైనాలో మరింత వ్యాపించిన కరోనా వైరస్
- 2 వేలు దాటిన మృతుల సంఖ్య
- చైనాలో పరిస్థితిపై సమీక్షించిన ఎయిరిండియా అత్యున్నత వర్గాలు
- ప్రకటన చేయనున్న సంస్థ సీఎండీ
చైనాలో కరోనా వైరస్ మృత్యుకేళి సాగిస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ప్రపంచ దేశాలు చైనాతో సంబంధాలను పరిమితం చేసుకున్నాయి. అనేక విమానయాన సంస్థలు చైనాకు తమ సర్వీసులు నిలిపివేశాయి. భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా చైనాకు అన్ని రకాల సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. జూన్ 20 వరకు చైనాకు విమానాలు నడపరాదని భావిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 2 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ ప్రమాదకర వైరస్ బారినపడిన వారి సంఖ్య వేలల్లో ఉంది.
ఈ నేపథ్యంలో చైనాలో పరిస్థితులపై సమీక్షించేందుకు ఎయిరిండియా అత్యున్నత నిర్ణాయక కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు విమానాలు నడపకపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఎయిరిండియా సీఎండీ ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.