New Delhi: ఇక్కడ ప్లాస్టిక్​ వేస్ట్​ తీసుకుని భోజనం పెడతారు.. ఢిల్లీలో వినూత్న హోటల్​

Cafe In Delhi Is Giving Meals In Exchange Of Plastic

  • దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
  • 250 గ్రాముల ప్లాస్టిక్ కు టిఫిన్లు.. కిలో ప్లాస్టిక్ తెస్తే ఫుల్ మీల్స్
  • ప్లాస్టిక్ వేస్ట్ ను నియంత్రించడమే లక్ష్యం

హోటల్ కు వెళితే ఏం చేస్తారు.. భోజనం చేసి డబ్బులు ఇచ్చి వస్తారు కదా.. కానీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ కు వెళితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే హోటల్ కు వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులు, సామాన్లు తీసుకెళ్తే చాలు. ఆ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకుని భోజనం పెడతారు. ప్లాస్టిక్ వేస్ట్ ను రీసైక్లింగ్ కు అనుగుణంగా సేకరించడం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా దక్షిణ ఢిల్లీలో వినూత్నంగా ఈ హోటల్ ను ఏర్పాటు చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో..

ఢిల్లీలో చెత్త సమస్యను నివారించడంతోపాటు ప్లాస్టిక్ వేస్ట్ ను సేకరించేందుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నజఫ్గఢ్ ప్రాంతంలోని ద్వారకలో ఈ సరికొత్త హోటల్ ను ప్రారంభించింది. 250 గ్రాముల ప్లాస్టిక్ ను తీసుకువస్తే.. స్నాక్స్ గానీ, టిఫిన్స్ గానీ ఇస్తారు. అదే కిలో ప్లాస్టిక్ ను తీసుకువస్తే ఫుల్ మీల్స్ పెడతారు.

ఇంతకు ముందు గుజరాత్, ఛత్తీస్ గఢ్ లోనూ

పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ఇంతకు ముందే గుజరాత్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లో కూడా ఈ తరహా హోటళ్లను ప్రారంభించారు. ఈ విధానాన్ని పరిశీలించిన ఢిల్లీ అధికారులు తాజాగా ప్లాస్టిక్ వేస్ట్ హోటళ్లను ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని చోట్ల ఇలాంటి హోటళ్లను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News